మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఆయన పేరిట స్మారకం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. మన్మోహన్ సింగ్ అత్యంత సాధారణ వ్యక్తి నుంచి గొప్ప రాజనీతిజ్ఞుడిగా అంచెలంచెలుగా ఎదిగారని, అలాంటి వ్యక్తికి స్మారకం నిర్మిస్తేనే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు మోదీకి ఆయన లేఖ రాశారు.
‘‘మాజీ ప్రధానుల స్మారకాలు నిర్మించడం ఆచారంగా కొనసాగుతోంది. మన్మోహన్ సింగ్కూ స్మారకం నిర్మిస్తే బాగుంటుంది. దేశ ముద్దుబిడ్డల్లో ఆయన ఒకరు. తన సేవలతో దేశ ప్రజల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన దార్శనికతతో దేశాన్ని గండం నుంచి గట్టెక్కించారు. దేశాన్ని వృద్ధి వైపు పరుగులు తీయించారు” అని ఖర్గే ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.